Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్‌-1బీ వీసా కష్టాలు.. తల్లి కోసం భారత్ వస్తే అమెరికా దారులు మూసుకుపోయాయి!

H1B Visa Holder Stranded in India Due to Visa Appointment Delays
Advertisement
  • అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భారత్ వచ్చిన హెచ్‌-1బీ వీసా మహిళ
  • తిరిగి అమెరికా వెళ్లేందుకు వీసా అపాయింట్‌మెంట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు
  • ఉద్యోగం, ఇల్లు కోల్పోయి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె కథ.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
Advertisement
అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తూ స్థిరపడిన ఓ భారతీయ మహిళ, తన జీవితంలో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకునేందుకు హుటాహుటిన భారత్‌కు వచ్చిన ఆమె, తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వీసా అపాయింట్‌మెంట్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె ఉద్యోగం ప్రమాదంలో పడింది. ఏళ్ల తరబడి నిర్మించుకున్న జీవితం కళ్ల ముందే కూలిపోతుండటంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు ఒకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్' ద్వారా పంచుకున్నారు. "నా స్నేహితురాలు తన తల్లి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయింది. ఆమె జీవితం, ఇల్లు, ఉద్యోగం, బాధ్యతలు అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. ఇంటి లోన్, కారు లోన్ ఈఎంఐలు ఆగవు కదా" అంటూ ఆయన తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. వీసా స్లాట్ దొరకకపోతే, అమెరికాలోని తన ఇల్లు, ఇతర ఆస్తులను అమ్ముకోవడానికి కూడా ఆమె సిద్ధపడుతున్నారని తెలిపారు.

విస్తృతమవుతున్న సమస్య
హెచ్‌-1బీ వీసాదారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం కొత్తేమీ కాదు. చాలాకాలం పాటు భారత్‌లో గడిపిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లే క్రమంలో వీసా రద్దు కావడం లేదా ఉద్యోగం కోల్పోవ‌డం అనే కారణంతో ఇబ్బందులు పడటం సాధారణమైంది. ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించడం వంటి అదనపు తనిఖీలతో వీసా ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
r/h1b అనే రెడిట్ గ్రూపులో పెట్టిన ఈ పోస్ట్ వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. కుటుంబానికి దూరంగా విదేశాల్లో ఉంటున్న అనేక మంది ఈ కథనంతో ఏకీభవించారు. "తల్లిదండ్రుల కోసం ఉద్యోగాన్ని, దేశాన్ని పణంగా పెట్టిన ఆమె నిర్ణయాన్ని గౌరవించాలి. నేనూ అదే పనిచేస్తాను" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "కష్టకాలంలో తల్లికి అండగా నిలవడం ఆమె కర్తవ్య దీక్షకు నిదర్శనం" అని మరొకరు ప్రశంసించారు.

అదే సమయంలో ఒక వినియోగదారు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ, "తాత్కాలిక వీసాను శాశ్వత నివాసంగా భావించకూడదు. ఈ నిబంధనలు ఎప్పుడైనా మారవచ్చనేది జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా ఇదే నిజం" అని వ్యాఖ్యానించారు. 
Advertisement
Advertisement
H-1B Visa
H1B Visa
US Visa
Indian Citizen
Visa Appointment
Immigration Issues
US Immigration
Reddit
Work Visa
United States

More Telugu News